కర్నూలు జిల్లాకు చేరుకున్న మంత్రి నారా లోకేశ్
- ఆదోనిలో ఘన స్వాగతం..
- ప్రముఖులతో కలిసి స్వాగతం పలికిన మంత్రి టీజీ భరత్
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోనికి చేరుకున్నారు. ఆదోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయనకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
మంత్రి లోకేశ్‌కు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వరరెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి నారా లోకేశ్ ఆదోని నియోజకవర్గంలో నిర్వహించే అధికారిక, పార్టీ కార్యక్రమాలకు బయలుదేరారు. సాయంత్రం మండిగిరిలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల సమన్వయ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదోని పట్టణంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయగా, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
