టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం..

టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం..

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులకు దేవినేని ఉమా నివాళి..

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వాతంత్ర్యం కోసం తన సంపాదన, జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌లో బారిష్టర్ విద్యాభ్యాసం పూర్తి చేసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందే అవకాశాన్ని వదులుకుని, దేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు ప్రకాశం పంతులని పేర్కొన్నారు. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. బ్రిటిష్ వారి తుపాకీ గుండుకు ఎదురుగా తన గుండెను చూపించి ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచినందుకే ప్రజలు ఆయనను “ఆంధ్రకేసరి”గా గౌరవించారని అన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక పోరాటాల్లో పాల్గొని “స్వరాజ్య” పత్రికను నడిపిన ఘనత కూడా ప్రకాశం పంతులుదేనని గుర్తుచేశారు. విజయవాడ బ్యారేజ్ నిర్మాణం ఆయన పట్టుదలకు నిదర్శనమని, తెలుగు జాతి చరిత్రలో ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయమని దేవినేని ఉమా పేర్కొన్నారు.