గుడివాడ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం..
గుడివాడ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం..
గుడివాడ, ఆంధ్రప్రభ: కృష్ణాజిల్లా గుడివాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే, స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాల్లో ఎదిగిన నువ్వు ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రావి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదంటూ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు వంగి దండాలు పెడుతున్నారని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “నీ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఎంతమంది కాళ్లు పట్టుకున్నాడో ఒకసారి గుర్తు చేసుకో. అవసరమైతే ప్రజలకు మేమే చెబుతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ కుటుంబ వ్యవహారాలపై వస్తున్న వివాదాలను ప్రస్తావిస్తూ.. “వారి కుటుంబ సభ్యులే జగన్‌పై మాట్లాడుతున్నారు. తల్లి అమెరికా వెళ్లిపోయిందని, చెల్లెళ్లు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలంతా వింటున్నారు. ఇవేమీ మేము చెప్పిన మాటలు కావు” అన్నారు.
గుడివాడ అభివృద్ధిపై కూడా కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. “క్యాసినోలు, పేకాటలు, బెట్టింగ్‌లతో యువత భవిష్యత్తును నాశనం చేసి గుడివాడను అభివృద్ధికి దూరం చేశావు. ప్రజలు ఇప్పటికే నీ తీరుకు గుణపాఠం చెప్పారు” అంటూ మండిపడ్డారు.
“అధికారం ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడి, అధికారం పోయిన తర్వాత గుడివాడకే రాకుండా దూరంగా ఉన్నావు. ఇప్పుడు మళ్లీ సమావేశాలు పెట్టి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు” అని ఆరోపించారు.
రెండేళ్లుగా గుడివాడ ప్రశాంతంగా అభివృద్ధి దిశగా సాగుతోందని, ఇప్పుడు మళ్లీ యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రారంభించడం దురదృష్టకరమన్నారు.
చివరగా.. “పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. గుడివాడ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అంటూ రావి వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
