సీఎం, మంత్రుల పీఏనంటూ బెదిరింపులు.

సీఎం, మంత్రుల పీఏనంటూ బెదిరింపులు.

వసూల్ రాజా ఉప్పల సంతోష్ కుమార్ అరెస్ట్…..

​మేడ్చల్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల పేర్లు చెప్పుకుంటూ, తానే వారి పీఏనని నమ్మిస్తూ కోట్లాది రూపాయల వసూళ్లకు, బెదిరింపులకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… ​మెదక్ జిల్లా శివంపేటకు చెందిన ఉప్పల సంతోష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి గత కొంతకాలంగా ‘వసూల్ రాజా’ అవతారమెత్తాడు.

తనను తాను కాంగ్రెస్ లీడర్‌గా చెప్పుకుంటూ.. కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో భూ వివాదాలు, సెటిల్‌మెంట్లు చేయడంలో దిట్టగా మారాడు. ఖరీదైన కారులో తిరుగుతూ, కద్దర్ బట్టలు ధరించి, విలాసవంతమైన హోటళ్లలో కూర్చొని సెటిల్‌మెంట్లు చేయడం ఇతని శైలి. గతంలో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాదంలో అప్పటి సీఐని ఇరికించి, సస్పెండ్ చేయించడంలో కూడా ఇతను కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

​రూ. 25 కోట్ల బెదిరింపులు.. RTI అస్త్రం…

​సంతోష్ గుప్తా ప్రధానంగా స్కూళ్లు, బార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేసేవాడు. వారి వ్యాపారాల్లోని లొసుగులను గుర్తించి, వాటిపై సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తులు వేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేవాడు. మునిరాబాద్‌లోని ఆర్‌ఆర్ వెంచర్‌ నిర్వాహకులను బెదిరించి ఐదు విల్లాలు ఇవ్వాలని, లేదంటే రూ. 25 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. నేను సీఎం మనిషిని, మంత్రులు నా మాట వింటారు అంటూ వ్యాపారస్తులను బురిడీ కొట్టించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.

​ఇటీవల మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంతోష్ గుప్తా ఫోన్ చేశాడు. తాను సీఎం మనిషినని, మీ భూమిలో సమస్యలు ఉన్నాయని, వచ్చి కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ​బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్ గుప్తాపై నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకుని, బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 308 (2) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో మేడ్చల్ సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లు చెప్పి ఎవరైనా బెదిరింపులకు లేదా వసూళ్లకు పాల్పడితే తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని, ఇలాంటి కేటుగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.