ఎస్.ఎం. కొత్తపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; రైతులు తీసుకొచ్చే వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తేమ శాతం వచ్చిన వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. భూపాలపల్లి మండలంలోని ఎస్.ఎం. కొత్తపల్లి గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు ఎలాంటి కోతలు విధించకుండా నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, రైతులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నందున ధాన్యం తడవకుండా ప్యాక్స్ ఆధ్వర్యంలో పరదాలు, ఇతర అవసరమైన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
రైతులు ఆందోళన చెందకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించా లని సూచించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి, భూపాలపల్లి ప్యాక్స్ చైర్మన్, సీఈఓ, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.
