వ్యాయామాలతో ఆరోగ్యం మెరుగు

వ్యాయామాలతో ఆరోగ్యం మెరుగు
-యువజన వారోత్సవాల్లో 3 కి.మీ వాకింగ్ చేసిన అధికారులు
-ఐదు గ్రామాల ప్రజలతో అవగాహన ర్యాలీ
భూపాలపల్లి రూరల్ , ఆంధ్రప్రభ: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యువజన వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపూర్ బస్టాండ్ నుంచి సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీవో తరుణ్ ముఖ్య అతిథిగా హాజరై యువతతో కలిసి నడిచారు.
ఈ వాకింగ్ కార్యక్రమంలో పెద్దాపూర్, గుర్రంపేట, బాసింగ్‌పల్లి, రామ్‌నాయక్ తండా, సుబక్కపల్లి గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఎంపీడీవో తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవనానికి నిత్య శారీరక వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజూ నడక, వ్యాయామం అలవాటు చేసుకోవాలని యువతకు సూచించారు.
వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని చెప్పారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న యువకులు, ప్రజలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో మంచి స్పందన తీసుకువస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
