పుట్టపర్తి సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్‌కు రంగం సిద్ధం
పుట్టపర్తి సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్‌కు రంగం సిద్ధం
కప్పల బండ ప్రాంతంలో నిర్మాణానికి అవకాశం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పుట్టపర్తి ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామిక, ఆర్థిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగిన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశ రక్షణ రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఏర్పాటవుతుండడంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ఉద్యోగులు, అధికారులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో అధునాతన వసతులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల పుట్టపర్తి సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ( ఏ ఎం సి ఏ ) ప్రాజెక్టుతో పాటు పలు పరిశ్రమలకు భూమిపూజ కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కర్ణాటకతో అనుసంధానం పెంచి పుట్టపర్తి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సూచించిన విషయం తెలిసిందే. బెంగళూరుకు సమీపంలో ఉన్న పుట్టపర్తి భవిష్యత్తులో రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే సందర్భంలో మంత్రి నారా లోకేష్ కూడా పుట్టపర్తి అభివృద్ధిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బెంగళూరుకు దీటుగా కేంద్ర రక్షణ శాఖ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతుందని ఆయన పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా పుట్టపర్తి పరిసర ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. దీంతో పుట్టపర్తి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పారిశ్రామిక హబ్‌గా కూడా రూపుదిద్దుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, అతిథులు, అధికారులు, పర్యాటకులకు అత్యాధునిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణంపై సమాలోచనలు జరుగుతున్నాయని సమాచారం.
ముఖ్యంగా యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి సమీపంలో ఉన్న కప్పల బండ పొలంలో ఈ హోటల్ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పుట్టపర్తి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యం లేకపోవడం వల్ల పర్యాటకులు, పారిశ్రామిక రంగ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో హోటల్ నిర్మాణం జరిగితే స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా పర్యాటక రంగానికీ కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
