ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; మచిలీపట్నంలోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే మచిలీపట్నం బైపాస్ రోడ్డుకు చెందిన హరిత అనే మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుటుంబ సభ్యురాలి మృతికి కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయం చేయాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి ఆస్పత్రి పరిసరాల్లో భద్రత ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మాతా శిశు విభాగం పోలీసుల వలయంలోకి వెళ్లింది.
ఈ ఘటన విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి పేర్ని కిట్టు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో చర్చించారు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఆసుపత్రి వైద్యులను ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనతో కొంతసేపు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కుటుంబ సభ్యులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
