రైతులు అధైర్య పడవద్దు.. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం..

రైతులు అధైర్య పడవద్దు.. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం..

  • మక్కల కొనుగోలు వేగవంతం చేయండి
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయ రమణారావు
  • పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ సందర్శన

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మండతున్న ఎండలు..హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో కొంత జాప్యం జరుగుతున్న కొనుగోళ్లు వేగవంతం చేసి కేంద్రాల్లోని చివరి గింజవరకు రైతుల నుండి మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలొని వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను శనివారం సందర్శించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఐకెపి, సింగల్ విండో సొసైటీల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ వేసవిలో నాలుగున్నర మెట్రిక్ టన్నుల వరి పండినట్లు సివిల్ సప్లై అధికారులు లెక్కలు చెబుతున్నారని, అధిక ఎండా కారణంగా మిల్లులో దిగుమతికి కొంత సమయం పడుతోందని అన్నారు. ఈనెల 25 రోహిణి ప్రారంభం వరకు మూడున్నర లక్షల టన్నుల వరి ధాన్యం కొనాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు కూడా దృష్టి పెట్టి పని చేస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మొక్క జొన్నలు కూడా 11 సెంటర్లో కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్న రైతులు అధైర్య పడవద్దని ఒక గింజ లేకుండా జొన్నలు కొనుగోలు చేస్తామని అన్నారు.

ప్రభుత్వం మొక్క జొన్నలకు రూ. 2400 మద్దతు ధర ఇస్తుందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాధాంతాలు రైతులు నమ్మవద్దని కోరారు. చుట్టుప్రక్కల వరి ధాన్యం కటింగు ఉందని, కేవలం పెద్దపల్లి నియోజకవర్గంలో లేకపోవడంతో ప్రతిపక్షాలు ఏదోరకంగా రాజకీయ కుట్రలు చేసినా వాటిని రైతులు పట్టించుకోవద్దని అన్నారు. 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో రైతులు కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కటింగుతో ఎంత ఇబ్బంది పడ్డారో రైతులకే తెలుసని, ప్రస్తుతం వరి ధాన్యం కటింగ్ లేకపోవడం వలన ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు.

ప్రస్తుతం 60 శాతం వరకు వరి ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మరో 40 శాతం 15 రోజులలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రైతులకు తాను అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. వరి ధాన్యం, మక్కల కొనుగోలు భాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.