కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష
గోదావరిఖని, ఆంధ్రప్రభ : పెద్దపెల్లి జిల్లా రామగుండం లోని మూసి వేయబడిన బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్టేట్ ఎనర్జీ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, తెలంగాణ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ మంగళవారం సందర్శించారు. ప్లాంట్ లోని ప్రతి ఏరియా స్థితిగతులను క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. స్థానిక జెన్కో అధికారుల నుండి ప్లాంట్ వివరాలను సేకరించారు. కార్యాలయంలో అధికారులతో కొంతసేపు సమీక్ష జరిపారు. నూతనంగా నిర్మాణం చేపట్టబోయే ప్లాంట్ కు సంబంధించి వనరుల సాధ్యసాద్యాలపై అధికారులతో చర్చించారు. రామగుండం బి థర్మల్ స్థానంలో 8 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.
ఈ ప్రక్రియలో భాగంగా ఎనర్జీ సెక్రెటరీ, తెలంగాణ జెన్కో సిఎండి ఇద్దరు కలిసి పర్యటన చేయడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. రామగుండంలో కొత్త పవర్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లు పరిస్థితులను చూస్తే తెలుస్తోంది. మూసి వేయబడిన ప్లాంటును కూల్చివేసే ప్రక్రియ చాలా పెద్ద ప్రొసీజర్ అని… అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని ఎనర్జీ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. అతి త్వరలో కూల్చివేత ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారుల హడావుడి చూస్తే తెలుస్తుంది. అంతకు ముందుగా ప్లాంట్ లోని స్క్రాప్ ను టెండర్ ప్రక్రియ ద్వారా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. సందర్శనకు వచ్చిన ఎనర్జీ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టలను, తెలంగాణ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ ను స్థానిక ఇంజనీర్లు ఘనంగా సన్మానించారు.
