ఉపాధి హామీ పని దినాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి.

ఉపాధి హామీ పని దినాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి.

జలధార–జలహారతి పనులు వేగవంతం చేయాలి.
జిల్లాలో 45 లక్షల మొక్కల నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాలు.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పని దినాలను వంద శాతం సద్వినియోగం చేసుకోవడంతో పాటు జలధార–జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఏడాదిలో జిల్లావ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జలధార–జలహారతి పథకాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ అధికారులతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పని దినాల వినియోగం తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఏ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఆశించిన స్థాయిలో జరగకపోతే అక్కడ టామ్‌టామ్ వేయించి గ్రామ సభలు నిర్వహించాలని, కార్మికులకు వారి వేతనాలు సకాలంలో జమ అవుతాయని అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయిలో కార్మికులను ప్రోత్సహించడం ద్వారా పని దినాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో పెంచాలని తెలిపారు.

జలధార–జలహారతి పనులపై ప్రత్యేక పర్యవేక్షణ జలధార–జలహారతి పథకం కింద ఆమోదం పొందిన పనులు, భౌతికంగా పూర్తైన పనుల వివరాలను ఎప్పటికప్పుడు “ఏపీ రిమ్స్ యాప్”లో నమోదు చేయాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశించారు. పూర్తయిన ప్రతి పనిని ఫోటోల ద్వారా నమోదు చేసి డిజిటల్ రికార్డింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ పనుల అమలులో ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేస్తూ లేబర్ కాంపోనెంట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల్లో ముందున్న మండలాలకు అభినందనలు తుగ్గలి, మంత్రాలయం, కోసిగి, ఆలూరు మండలాల్లో ఉపాధి హామీ పనులు, లేబర్ కాంపోనెంట్ వినియోగం మెరుగ్గా ఉన్నట్లు కలెక్టర్ అభినందించారు. మరోవైపు గోనెగండ్ల, పెద్దకడబూరు మండలాల్లో పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కారణాలు తెలుసుకుని మెరుగైన మండలాల విధానాలను అనుసరించాలని సూచించారు.

భూగర్భ జలాల పెంపుపై దృష్టి..

జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, వాగులు, పర్కొలేషన్ ట్యాంకులు, క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెక్‌డ్యామ్‌లు పూడికతో నిండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే రూ.1.80 లక్షల వ్యయంతో “రీఛార్జ్ షాఫ్ట్ ఇంజక్షన్ వెల్” నిర్మాణం ద్వారా భూగర్భ జలాల పెంపుకు చేపట్టాల్సిన సాంకేతిక విధానాలపై కూడా అధికారులకు వివరించారు.

45 లక్షల మొక్కల నాటే లక్ష్యం..

జిల్లా విస్తీర్ణంలో 50 శాతం మేర చెట్ల పెంపకం లక్ష్యంగా ఈ ఏడాది 45 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి వసతి ఉన్న, లేని పొలాలను రైతు సేవా కేంద్రాల ద్వారా గుర్తించి రైతుల పొలాల్లో 25 లక్షల పండ్ల మొక్కలను పెంచేలా ఉద్యాన శాఖ, డ్వామా, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మిగిలిన 20 లక్షల మొక్కలను అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, రహదారుల పక్కన విస్తృతంగా నాటేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. డీఈవో, డీఆర్‌డీఏ, మెప్మా, మున్సిపాలిటీలు, ఆర్టీసీ, జాతీయ రహదారుల శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో మొక్కల పెంపక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో డీఆర్‌వో (ఇన్‌చార్జి) చిరంజీవి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో రమణారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, ఇరిగేషన్ డీఈ కృష్ణన్న, గ్రౌండ్ వాటర్ డీడీ సునీల్‌కుమార్, ఉద్యాన శాఖ ఏడీ రాజాకృష్ణారెడ్డి, జిల్లాలోని ఎంపీడీవోలు, ఏపీవోలు తదితర అధికారులు ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.