ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం…

ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం…
అభివృద్ధిని మళ్లించే యత్నం: టీడీపీ ఆరోపణ
పెట్రోల్, డీజిల్ సంక్షోభం కృత్రిమమే… వైసీపీపై తీవ్ర విమర్శలు.
ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందే వైసీపీ ప్రచారం
కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పెట్రోల్, డీజిల్ కొరతపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కర్నూలులో జరిగిన విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిసె అది కృష్ణమ్మతో పాటు ఇతర నాయకులు మాట్లాడారు. ఏప్రిల్ 28న విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్‌కు శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రజలకు కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తప్పుడు ప్రచారం సాగుతోందని వారు విమర్శించారు.
వైసీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురై అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల తాత్కాలిక కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 165 పెట్రోల్ బంకులు ఉండగా, రోజువారీగా సుమారు 2.40 లక్షల లీటర్ల పెట్రోల్, 3.17 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 15 లక్షల లీటర్ల పెట్రోల్, 23 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
పరిస్థితిని గమనించిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవడంతో కొద్ది సమయంలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరిందని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సమస్యను అధిగమించారని అభినందించారు. వైసీపీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తగదని హెచ్చరించారు. జిల్లాలో ఇంధన వినియోగంపై అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను దారి మళ్లించేందుకు రాజకీయ ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన విషయంపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
