టీడీపీ ఆవిర్భావ స్పూర్తితో ముందుకు…
టీడీపీ ఆవిర్భావ స్పూర్తితో ముందుకు…
రాష్ట్రాభివృద్ధే టీడీపీ లక్ష్యం
ఎన్టీఆర్ ఆశయాలే మార్గదర్శకం
జాతీయ రాజకీయాల్లో టీడీపీ ముద్ర
టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ..
విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆటోనగర్‌లోని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావు వెనుకబడిన వర్గాలు, మహిళలు, రైతులు, యువత సంక్షేమం కోసం పార్టీని స్థాపించారని ఆమె పేర్కొన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని గుర్తుచేశారు.
నారా చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా యువత సమస్యలను తెలుసుకుని, పెట్టుబడులు తీసుకురావడంలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని, పార్టీని రాబోయే 20-25 సంవత్సరాల పాటు బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. పార్లమెంట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ జెండా రెపరెపలాడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేని సమయంలో ఎన్టీఆర్ నాయకత్వంలో ‘నేషనల్ ఫ్రంట్’ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో టీడీపీ బలమైన ముద్ర వేసిందని తెలిపారు. ఐ.కె. గుజ్రాల్, హెచ్.డి. దేవెగౌడ వంటి ప్రధానమంత్రులు, అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు చొరవను వారు ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం టీడీపీ ప్రత్యేకత అని, సామాన్య కార్యకర్తలకు కూడా నాయకత్వంలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ప్రమాద బీమా వంటి పథకాలతో అండగా నిలుస్తున్నారని వివరించారు. తోట చంద్రయ్య వంటి కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలిచి సహాయం చేసిన విషయాలను గుర్తు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ, గద్దె అనురాధ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టగా, చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు.

