గ్రంథాలయాలు విజయం వైపు నడిపించే జ్ఞాన మందిరాలు..

గ్రంథాలయాలు విజయం వైపు నడిపించే జ్ఞాన మందిరాలు..

తిరువూరు శాసన సభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు.
తిరువూరు గ్రంథాలయం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు..
ఉద్యోగాలు సాధించిన యువతకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘన సన్మానం
గ్రంథాలయ అభివృద్ధికి రూ. లక్ష సాయం.. కొత్త పుస్తకాలకోసం హామీ
త్వరలో 24/7 స్టడీ హాల్‌తో ఉచిత గ్రూప్స్ కోచింగ్..
చిన్నారుల కోసం సమ్మర్ ఓరియంటేషన్ ప్రారంభం

తిరువూరు, ఆంధ్రప్రభ : గ్రామీణ యువతకు గ్రంథాలయాలు విజయం వైపు నడిపించే జ్ఞాన మందిరాలుగా నిలుస్తున్నాయని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో 2023 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, విద్యార్థినిలను రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎం.ఎస్. బేగ్తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు గ్రంథాలయాలు అమూల్యమైన వనరులని అన్నారు. క్రమశిక్షణతో చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అసాధ్యం కాదని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.

గ్రంథాలయ అధికారిణి పద్మావతి వినతిపై తిరువూరు గ్రంథాలయ అభివృద్ధి కోసం అవసరమైన పుస్తకాలు, కుర్చీలు, ఏసీల కొనుగోలుకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. అదనంగా మూడు సెట్ల కొత్త పుస్తకాలను కూడా అందిస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, రాత్రి వేళల్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కోరారు.

ఇంకా రాబోయే రెండు నెలల్లో తన సొంత నిధులతో గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం హైదరాబాద్‌కు చెందిన నిపుణులైన ఫ్యాకల్టీతో 24 గంటల స్టడీ హాల్ సౌకర్యంతో ఉచిత కోచింగ్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రకటించడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రత్యేక సమ్మర్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. గ్రంథాలయంలో రోజురోజుకీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు గదులు, మరో అంతస్తు అవసరమని అధికారులు కోరగా, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.