జాతీయ టీకా దినోత్సవం మర్చిపోయిన అధికారులు

శంకర్‌పల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి సమయంలో కోట్లాది మంది భారతీయులకు రక్షణ కల్పించిన టీకాల ప్రాముఖ్యతను గుర్తుచేసే జాతీయ టీకా దినోత్సవం ఈ సారి శంకర్‌పల్లి మండలంలో మరిచిపోయినట్టైంది.
కరోనా సమయంలో “చస్తామా.. బతుకుతామా” అన్న భయాందోళనల మధ్య ప్రజలకు రక్షణ కవచంలా నిలిచిన వ్యాక్సిన్ మనుగడకు భరోసా ఇచ్చింది. అయితే అలాంటి ముఖ్యమైన రోజును ఆసుపత్రి వర్గాలు, ప్రజలు పెద్దగా గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మండల పరిధిలోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా జాతీయ టీకా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించలేదని స్థానికులు పేర్కొన్నారు. కరోనా సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ కొన్ని దేశాలకు ఈ టీకాలను ఉచితంగా పంపిణీ చేసి గొప్ప గుర్తింపు పొందింది.
అలాంటి శాస్త్రవేత్తల ప్రతిభను స్మరించుకునే రోజుగా జాతీయ టీకా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కరోనా మహమ్మారి మనకు టీకాల ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేసిందని, ప్రజలు టీకాలపై అవగాహన పెంచుకొని ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ముఖ్యమైన రోజులను నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
