తెలంగాణను 36 నుంచి 18వ స్థానానికి తీసుకొచ్చాం- సీఎం రేవంత్ రెడ్డి

  • షాబాద్‌లో ప్రీమియర్ సోలార్ ఎనర్జీస్ కంపెనీ ప్రారంభం..
  • పరిశ్రమలతోనే నిరుద్యోగానికి చెక్
  • 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్న సీఎం

షాబాద్, ఆంధ్రప్రభ: అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టి తెలంగాణను దేశంలో 36వ స్థానం నుంచి 18వ స్థానానికి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ర్యాంకింగ్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించిన నివేదికలు నిర్ధారించాయని చెప్పారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామ సమీపంలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ సోలార్ ఎనర్జీస్ సంస్థను మంత్రి శ్రీధర్ బాబు, శాసన మండలి విప్ మహేందర్ రెడ్డితో కలిసి సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సోలార్ శక్తి వినియోగం వల్ల కాలుష్యం తగ్గుతుందని, కృత్రిమ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తున్న ఈ సంస్థ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. మెట్రో నగరాల్లో కాలుష్యం తీవ్ర సమస్యగా మారిందని, భవిష్యత్తులో తెలంగాణలో కాలుష్య నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను దశలవారీగా నగర శివార్లకు తరలించి, ఆ ప్రాంతాలను ప్రజల నివాసాలకు అనుకూలంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మూసీ నది సుందరీకరణ కూడా కాలుష్య నియంత్రణలో భాగమేనని పేర్కొన్నారు. చెట్ల నరికివేత, చెరువుల ఆక్రమణ, ప్రకృతి విధ్వంసం వల్ల కాలుష్యం మరింత పెరుగుతోందని, ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలంటే కొత్త పరిశ్రమలు రావాల్సిందేనని సీఎం అన్నారు. ప్రీమియర్ సోలార్ ఎనర్జీస్ సంస్థ కేవలం 12 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి పరిశ్రమలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

సీతారాంపూర్ గ్రామంలోని 1,100 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండు రోడ్ల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని, అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతిపక్షాలు అభివృద్ధిని ప్రోత్సహించకుండా విమర్శలకే పరిమితమవుతున్నాయని అన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకోవచ్చని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యాదయ్య, మనోహర్ రెడ్డి, ప్రీమియర్ సోలార్ ఎనర్జీస్ చైర్మన్ సురేంద్ర పాల్ సింగ్ సాలుజా, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి సింగ్ సాలుజా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవతి రోహిణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.