వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం..

వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం..

మెడికవర్ హాస్పిటల్స్‌లో కిడ్నీ ఆరోగ్యంపై నిపుణుల సూచనలు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కర్నూలులోని మిడిల్ కవర్ హాస్పిటల్ లో గురువారం కిడ్నీ ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు కిడ్నీ ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ వివిధ సూచనలు చేశారు. ఈ ఏడాది వరల్డ్ కిడ్నీ డే థీమ్ ను ప్రాముఖ్యంగా తీసుకుని కిడ్నీ వ్యాధుల నివారణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై వైద్యులు వివరించారు. ముఖ్యంగా డయాలిసిస్ చికిత్స సమయంలో అధికంగా నీటి వినియోగం జరుగుతుందని, అలాగే వైద్య ప్రక్రియల్లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. కిడ్నీ వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించడం ద్వారా డయాలిసిస్ అవసరాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, లేజర్ యూరాలజీ నిపుణుడు డా. ఎస్. అబ్దుల్ సమద్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు కిడ్నీ పరీక్షలు తరచుగా చేయించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని అన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా కిడ్నీ వ్యాధులను ముందుగానే నివారించవచ్చని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలతో పాటు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉందని తెలిపారు.

Leave a Reply