యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం…

యువత ఉపాధి వారసత్వ పరిరక్షణే లక్ష్యం…

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలో నంబర్–1గా నిలపాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక టూరిజం పాలసీని ప్రకటించిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో పర్యాటక శాఖ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పర్యాటకం అంటే కేవలం పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాదని, యువతకు ఉపాధి కల్పించడం, సాంస్కృతిక–చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆకర్షించిన మొత్తం పెట్టుబడుల్లో రూ.28 వేల కోట్లు పర్యాటక రంగానికే చెందాయని, వీటి ద్వారా 1.22 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టి అవుతాయని తెలిపారు. పర్యాటక శాఖకు కేటాయించిన రూ.439 కోట్లు సరిపోవని, నిధులు పెంచాలని కోరారు. వివిధ ఉత్సవాల నిర్వహణకు కేటాయించిన నిధులను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. కొండవీడు కోటకు అపారమైన చారిత్రక ప్రాశస్త్యం ఉందని, దాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు. అలాగే కళలకు ప్రసిద్ధి చెందిన చిలకలూరిపేటలో ప్రారంభించి పూర్తికాని ఆడిటోరియం నిర్మాణాన్ని టూరిజం శాఖ పరిధిలోకి తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళల రాక పెరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక వసతులు, భద్రతా చర్యలు కల్పించాలని ప్రత్తిపాటి సూచించారు.

Leave a Reply