సైకిల్‌పై హరిత సందేశం..
మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎమ్మెల్యే పిలుపు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పర్యావరణ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తన కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా సాగిన సైకిల్ ర్యాలీ అడపాల వీధిలోని మున్సిపల్ హైస్కూల్‌కు చేరుకుంది. అనంతరం పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటి హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
చెట్లు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు సైకిల్ ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పారు.
ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత చైతన్యం తీసుకొచ్చిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, విద్యార్థులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
