Guntur – జి జి హెచ్ లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ..

గుంటూరు, ఆంధ్రప్రభ: పోలీస్ కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు తీసుకొచ్చారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ లో ఉన్న వంశీని విచారిస్తున్న సమయంలో అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతున్నాడు. వంశీని వెనువెంటనే ఆదివారం కంకిపాడు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. వంశీకి శ్వాసకోశ కు సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించారు.

వీటితోపాటు బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే బిపి షుగర్ సాధారణంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వంశి ని జి జి హెచ్ కి తీసుకురావడంతో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు నేతలు వైద్యశాల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్యశాలలోకి ఎవరిని అనుమతించడం లేదు. చికిత్స పూర్తి కావడంతో ఆయనను విజయవాడలో జైలుకు తరలించారు.

హాస్పిటల్ వద్ద వంశీ సతీమణి

వల్లభనేని వంశీ ఆరోగ్యపరిస్థితి తెలుసుకునేందుకు ఆయన భార్య పంకజశ్రీ గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. వంశీని కలిసేందుకు పంకజశ్రీకి పోలీసులు అనుమతించలేదు. వైద్యం జరుగుతుందని, కలిసేందుకు వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో పోలీసులతో వంశీ భార్య వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌ ఎంట్రన్స్ గేటు వద్దే వంశీ భార్య ఉన్నారు. పోలీసుల అనుమతి కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.

Leave a Reply