గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు

గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు
- జిల్లా కలెక్టర్ కె.హరిత
తిర్యాణి, ఆంధ్రప్రభ : జిల్లాలోని గురుకుల పాఠశాలలలో నెలకొన్న సమస్యల పరిష్కారం పై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం మండలం చింతపల్లి గ్రామంలో గల గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు.

వేసవికాలం సమీపిస్తున్నందున నీటి సమస్య లేకుండా నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో బోర్ వెల్ ఏర్పాటు చేసే దిశగా గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వంట సమయంలో సిబ్బంది పరిశుభ్రత నిబంధనలను పాటించాలని తెలిపారు. డార్మెటరీ గదిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, డ్రైనేజీ వ్యవస్థ పకడ్బందీగా నిర్వహించాలని, మూత్రశాలలకు తలుపులు ఏర్పాటు చేయాలని, మురుగు కాలువల నిర్మాణాలకు అంచనా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. విధుల పట్ల సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఆలస్యం కాకుండా చూసుకోవాలని తెలిపారు.
ప్రధానోపాధ్యాయులను మార్చాలని విద్యార్థులు కోరగా ప్రిన్సిపాల్ ను వెంటనే ఇతర ప్రాంతానికి డిప్యూటేషన్ పై పంపించి సీనియర్ ఉపాధ్యాయురాలు రమ్య కు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బాధ్యతలను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలలో కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యా బోధన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
