​దుర్గగుడి రిటైర్డ్ ఉద్యోగులకు ఘన సత్కారం

30 ఏళ్ల సేవలను కొనియాడిన ఆలయ అధికారులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో సుదీర్ఘకాలం సేవలందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బుధవారం ఆలయ మహా మండపం 6వ అంతస్తులో ఘనంగా సత్కార కార్యక్రమం జరిగింది. ​దేవస్థానంలో 30 సంవత్సరాలకు పైగా నిరుపమానమైన సేవలు అందించిన బి. త్రినాధ్ (సీనియర్ అసిస్టెంట్), కె. పద్మజ (జూనియర్ అసిస్టెంట్) ల సేవలను ఆలయ అధికారులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్. రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పి. చంద్రశేఖర్, డాక్టర్ కె. గంగాధర్, ఎం. తిరుమలేశ్వరరావు పదవీ విరమణ చేసిన సిబ్బంది కర్తవ్య దీక్షను, ఆలయ అభివృద్ధికి వారు అందించిన సేవలను కొనియాడారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా గడవాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ చేసిన బి. త్రినాధ్, కె. పద్మజ దంపతులను ఆలయ అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు నూతన వస్త్రాలను అందజేసి గౌరవించారు. ​ఈ సత్కార కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సూపరింటెండెంట్లు, తోటి సిబ్బంది మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.