వైసీపీ కుట్రలు ఫలించవు..
తెలుగుజాతి గర్వపడేలా అమరావతి నిర్మాణం..
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలుగుజాతి గర్వపడేలా అమరావతి నిర్మాణం కొనసాగుతోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిపై విషం చిమ్ముతూ జగన్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో గొడ్డలి పార్టీ దుకాణం పూర్తిగా బంద్ అయిందని, ఇప్పటికైనా వైసీపీ నేతలు కళ్లు తెరవాలని సూచించారు.
అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ, అనంతరం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిందని విమర్శించారు. విధ్వంసాల పాలన, పరదాల పాలనతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. అమరావతి రైతులు, మహిళలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఆ పార్టీని 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా సమతుల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థలు, డేటా సెంటర్లు రావడంతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదుగుతోందని, రాయలసీమలో తయారవుతున్న వాహనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విధ్వంసాలు, గొడ్డలి వేట్లు, డోర్ డెలివరీల ప్రచారం, గులకరాయి నాటకాలే వైసీపీ పాలనకు గుర్తుగా మిగిలాయని ఎద్దేవా చేశారు. అమరావతిపై దాడి చేయాలనుకున్న మారీచులను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. అసత్య ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు వాటిని నమ్మడం లేదన్నారు. నేడు జగన్ వల్లెవేస్తున్న న్యాయం, ధర్మం అనే పదాలకు వైసీపీ డిక్షనరీలో చోటు లేదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
