ఇంద్రకీలాద్రి ఆలయంలో అసభ్య ఘటన..

ఇంద్రకీలాద్రి ఆలయంలో అసభ్య ఘటన..

మహిళల బాత్రూమ్‌లోకి చొరబడి చిత్రీకరణ…
దుండగుడికి మహిళలే గుణపాఠం
నిందితుడిని అదుపులోకు తీసుకున్న వన్‌టౌన్ పోలీసులు
ఫోన్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మహామంటపం 6వ అంతస్తులో ఉన్న మహిళల బాత్రూమ్‌లోకి నరేష్ (20) అనే యువకుడు చొరబడి మహిళలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న నరేష్‌ను గుర్తించిన మహిళలు వెంటనే అతడిని పట్టుకుని అడ్డుకున్నారు.

ఈ సమయంలో మహిళలు గట్టిగా కేకలు వేయడంతో ఆలయ భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహంతో మహిళలు నరేష్‌కు తగిన గుణపాఠం చెప్పినట్లు సమాచారం. తదుపరి మహిళా భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అతడి మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

నిందితుడు విజయవాడ చిట్టినగర్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, అతడు ఎప్పటి నుంచి ఆలయం పరిసరాల్లో తిరుగుతున్నాడన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply