స‌ర్ డిజిటైజేష‌న్ స‌జావుగా..

  • జిల్లాలో 54.61 శాతం మేర పూర్త‌యిన ప్ర‌క్రియ‌
  • నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో వేగ‌వంతానికి కృషి
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ: జిల్లాలో ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్ఐఆర్‌) ప్ర‌క్రియ‌లో భాగంగా ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంద‌ని.. ఈ ప్ర‌క్రియ వేగ‌వంతానికి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో, మార్గ‌నిర్దేశంతో కృషిచేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.

ఎన్యూమ‌రేష‌న్ ఫారాలు నింపడంలో, సమర్పించడంలో సహాయం చేయడానికి అందుబాటులో ఉన్న హెల్ప్ డెస్కులను సద్వినియోగం చేసుకునేలా ఓటర్లకు అవగాహన క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో 9,35,754 (54.61 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ పూర్త‌యింద‌న్నారు.

తిరువూరులో 1,46,751 (70.31 శాతం) డిజిటైజేషన్ జరగ్గా.. విజ‌య‌వాడ ప‌శ్చిమలో 1,10,300 (42.92 శాతం), విజ‌య‌వాడ సెంట్ర‌ల్ 1,26,272 (45.45 శాతం), విజ‌య‌వాడ తూర్పు 1,28,050 (47.47 శాతం), మైల‌వ‌రం 1,83,067 (64.2 శాతం), నందిగామ 1,26,765 (61.1 శాతం), జ‌గ్గ‌య్య‌పేటలో 1,14,549 (55.19 శాతం) మేర ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు వివ‌రించారు. బీఎల్‌వోలు, అధికారులు ఈసీఐ నియ‌మ‌నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వర్తించేలా ఎలాంటి ప్ర‌భావాల‌కు తావులేకుండా నిష్ప‌క్ష‌పాతంగా నిబ‌ద్ధ‌త‌తో స‌ర్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డంలో భాగ‌స్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు