అటవీ అధికారుల బైక్‌కు నిప్పు పెట్టిన దుండగులు

అటవీ అధికారుల బైక్‌కు నిప్పు పెట్టిన దుండగులు
సిరికొండ , ఆంధ్రప్రభ: విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై దుండగులు బరితెగించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల అటవీ ప్రాంతంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. సిరికొండ ఎఫ్.ఆర్.ఓ (FRO) నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం రావుట్ల సెక్షన్ అధికారి ఈ. లచ్చయ్య, బీట్ అధికారి శ్రీకాంత్ కలిసి ప్రభుత్వ వాహనం (TS EF 2046) పై అటవీ తనిఖీలకు వెళ్లారు. అడవిలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 395 వద్ద బైక్‌ను పార్క్ చేసి, పెట్రోలింగ్ కోసం లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దుండగులు వారి ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా దగ్ధం చేశారు.
ఈ ఘటనపై అటవీ అధికారులు సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై జె. రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే, గత కొంతకాలంగా రావుట్ల సెక్షన్ పరిధిలో అటవీ భూములను ఆక్రమించి, చెట్లను నరికి సాగు చేస్తున్న వ్యక్తులపై అటవీ శాఖ కేసులు నమోదు చేస్తోంది. ఈ కక్షతోనే అక్రమార్కులు ప్రభుత్వ వాహనాన్ని తగులబెట్టి ఉంటారని ఎఫ్.ఆర్.ఓ అనుమానం వ్యక్తం చేశారు.
