నిధులు ఇస్తా… ప‌నులు చేసే బాధ్య‌త మీదే!

నిధులు ఇస్తా… ప‌నులు చేసే బాధ్య‌త మీదే!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM RevanthReddy) స్ప‌ష్టం చేశారు. ఈ రోజు మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్ష‌ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివ‌రించారు. అలాగే సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు సీఎం తెలుసుకున్నారు.

స‌మీక్ష స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే వంద రోజులు సమ్మక్క సారలమ్మ (Sammakka Sarakka) మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో అంద‌రూ స‌మాఖ్యంగా ప‌నిచేయాల‌ని కోరారు. నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని, పనులు పూర్తి చేయించుకునే బాధ్యత మీపై ఉంద‌న్నారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ (Dedicated Team) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ టీమ్ ద్వారా అభివృద్ధి చేయాల‌ని సూచించారు. వందరోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రేడి మాట‌ల్లో…

  • ఆదివాసీలు దేశానికి మూలవాసులు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు.
  • నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తున్నా.. ఫిబ్రవరి 6, 2023 న ఈ గడ్డమీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టా
  • సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.
  • సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మీ అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే మా అభిమతం. ఇది డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో కొలిచేది. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలి.
  • రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించా ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క సారలమ్మ ఆలయం ఉంది
  • ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైన‌ వారి జన్మ ధన్యమవుతుంది. ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది.
  • ఆదాయం ఆశించి కాదు… భక్తితో పనిచేయాలి. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలి.
  • జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. అవసరమైనచోట చెక్ డ్యామ్ లు నిర్మించాలి.