16th Parole : సర్కారు గ్రీన్ కార్పెట్ Andhra Prabha Top Story
16th Parole : సర్కారు గ్రీన్ కార్పెట్ Andhra Prabha Top Story
- కాన్వాయ్ రయ్ రయ్
- Z + సెక్యూరిటీ
- 55 మంది కమెండోలు.. కార్లు..
- ఖర్చు ₹ 40 నుంచి ₹ 50 లక్షలే
- పెరోల్‌ల వెనుక రాజకీయ ఆరోపణలు
- ఖైదీ భద్రతకే కోట్ల ప్రజాధనం ఖర్చు
- దేశ జైళ్లలో అండర్‌ట్రయల్ ఖైదీల దుస్థితి
- జైళ్లలో పెరుగుతున్న రద్దీ.. న్యాయవ్యవస్థపై ప్రశ్నలు
- తెలుగు రాష్ట్రాల్లోనూ అండర్‌ట్రయల్ ఖైదీల సమస్య
- పేద ఖైదీలకు బెయిల్ ఎందుకు అందడం లేదు?
- సెక్షన్ 436A అమలు పై మానవ హక్కుల సంఘాల ఆందోళన
( ఆంధ్రప్రభ, చండీగడ్ ప్రతినిధి)

వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇదీ భారత శిక్షస్మృతి లెక్క. కానీ.. మన చట్టం . పెత్తందారులకు ఏనాడో చట్టుంగా మారిపోవటమే కాదు.. బ్యాక్ డోర్ డ్యూటీలో సెక్యూరిటీ గార్డ్ పాత్ర పోషిస్తోంది. ఇద్దరు సాద్వీలపై అత్యచారం.. మరో హత్య కేసులో జీవిత ఖైదీగా అవతరించిన డేరా బాబా.. అదే అభినవ కీచక యోగి .. జెడ్ ప్లస్ కేటగిరి బందోబస్తులో ఊరేగుతున్నాడు. ఈ ఒక్క దోషి పెరోల్ సదుపాయంలో సర్వ సుఖాలు అనుభవిస్తుంటే… భారత దేశంలోని జైళ్లల్లో.. 5 లక్షలకు పైగా ఖైదీలు శిక్షను అనుభవిస్తుంటే.. ఏ నేరం రుజువు కానీ 3.9 లక్షల మంది అనామకులు అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గిపోతున్నారు. తాజాగా..
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో.. పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ డేరా బాబాను 2017 ఆగస్టులో దోషిగా నిర్ధారించింది. రెండు అత్యాచారం కేసుల్లో విడివిడిగా 10 ఏళ్ల చొప్పున.. మొత్తం 20 ఏళ్ల కఠిన జైలు కఠిన కారాగార శిక్ష ₹30 లక్షల జరిమానా విధించింది. ఈ దోఫి రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది సరే. డేరా ఆశ్రమంలోని అకృత్యాలను, సాధ్వీలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తీసుకు వచ్చిన ‘పూరా సచ్’ జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని 2002లో కాల్చి చంపాడు. ఈ హత్యకు డేరా బాబా కుట్ర ప్రధాన కారణమరని తేలింది. ఈ కేసు విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబా సహా మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. 2019 జనవరిలో యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) విధించింది. 2026 మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ కేసును పునఃసమీక్షించి, సరైన ఆధారాలు లేవనే కారణంతో డేరా బాబాను ఈ ఒక్క కేసు నుండి నిర్దోషిగా విడుదల చేస్తూ (Acquitted) తీర్పునిచ్చింది రంజిత్ సింగ్ (డేరా మేనేజర్) హత్య కేసునేరం: ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల అనామక లేఖను సర్క్యులేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడనే అనుమానంతో డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌ను 2002 జూలైలో హత్య చేశారు.తీర్పు: 2021 అక్టోబర్‌లో సీబీఐ కోర్టు ఈ కేసులో డేరా బాబాకు మరో యావజ్జీవ శిక్ష విధించింది.ఇటీవలి పరిణామం: ఈ కేసులో కూడా 2024 మే నెలలో పంజాబ్ హర్యానా హైకోర్టు డేరా బాబాను మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ లోయర్ కోర్టు తీర్పును కొట్టేసింది. భగవంతుడి సేవకులుగా ఆశ్రమంలో చేరిన 400 మంది పురుష అనుచరులకు బలవంతంగా పురుషత్వ హరణ శస్త్రచికిత్సలు చేయించారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణలో ఉంది. ఈ బాబా ఘన నేర చరిత్ర.
16th Parole : ఇప్పుడే పెరోల్ దేనికో..? ,

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడినప్పటికీ, గత 9 ఏళ్లలో డేరా బాబా సత్ప్రవర్తన కోటాలో 16 సార్లు పెరోల్/ఫర్లోపై బయటకు వచ్చాడు. 400 రోజులకు పైగా జైలు వెలుపలే గడిపాడు. ఈయనకు ఉన్న భారీ అనుచర గణం జైలుకు వెళ్లే సమయంలో జరిగిన దాడుల (40 మంది మృతి) నేపథ్యంలో ప్రాణాపాయం ఉందనే ప్రభుత్వ నిఘా వర్గాల నివేదికల ఆధారంగా జైలు వెలుపల ఉన్నప్పుడు హర్యానా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోం ది. చట్టప్రకారం ఖైదీల సత్ప్రవర్తన ఆధారంగానే పెరోల్ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, ఎన్నికల సమయంలోనే ఈయనకు పెరోల్ రావడంపై బాధితుల కుటుంబాలు విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి
16th Parole : హర్యానా.. అనధికార అమాత్యుడే

హర్యానాలోని రోహ్‌తక్ సునారియా జైలు నుంచి మంగళవారం గుర్మీత్ బాబా బయటకు వచ్చాడు. ఈ కాలంలో ఈయన సిర్సాలోని తన డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటాడని డేరా ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు ఇదే ఏడాది 2026 జనవరి 5న 40 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. 2025 సంవత్సరంలో మూడు సార్లు (జనవరిలో 30 రోజులు, ఏప్రిల్‌లో 21 రోజులు, ఆగస్టులో 40 రోజులు) జైలు వెలుపలికి వచ్చాడు. 2017లో అత్యాచారం కేసులో శిక్ష పడినప్పటి నుండి ఇప్పటివరకు 16 సార్లు పెరోల్ లేదా ఫర్లో (తాత్కాలిక విడుదల) లభించింది. ఈ 9 ఏళ్ల శిక్షా కాలంలో ఈయన సుమారు 436 రోజులకు పైగా జైలు వెలుపలే గడిపాడు. తరచుగా విడుదల చేయడంపై బాధితుల కుటుంబాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీబీఐ కింది కోర్టు తీర్పుల నుంచి డేరా బయటపడ్డాడు. ఇక మిగిలిన కేసుల నుంచి తప్పించుకోవటమే.. ఆయన లక్ష్యం.. అని బాధితులు ఆరోపిస్తున్నారు.
16th Parole : 16వ పెరోల్ పండగ
ఈ ఏడాది మొదటి పెరోల్ (15వ సారి) ముగిసిన తర్వాత 2026 ఫిబ్రవరి 14న ఆయన తిరిగి జైలుకు వెళ్లాడు. అక్కడ నుంచి నిరంతరాయంగా సుమారు 101 రోజులు రోహ్‌తక్ సునారియా జైలు బ్యారక్‌లోనే శిక్ష అనుభవించాడు. ఆ తర్వాతే హర్యానా ప్రభుత్వం మే 26న 16వ సారి పెరోల్ మంజూరు చేసింది. హర్యానా గుడ్ కాండక్ట్ ప్రిజనర్స్ చట్టం ప్రకారం ఒక ఖైదీకి ఏడాదికి 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందే హక్కు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో 40 రోజులు, ఇప్పుడు 30 రోజులు వాడుకోవడంతో.. 2026 సంవత్సరానికి గానూ డేరా బాబా తన 70 రోజుల పెరోల్ కోటాను పూర్తిగా పూర్తి చేసుకున్నాడు. ఇక మరో 21 రోజుల ఫర్లో మాత్రమే మిగిలి ఉంది.
16th Parole : ఖైదీ భద్రతకు ఇంత ఖర్చా…

జెడ్ ఫ్లస్ కేటగిరి భద్రతకు నెలకు సగటున రూ. 40 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం డేరా బాబా భద్రతకు 30 రోజులకు (ఒక నెలకు) అయ్యే ఖర్చు కూడా సుమారుగా రూ. 40 – 50 లక్షలు ఉంటుంది. రోజువారీగా లెక్కిస్తే ఇది సుమారు రూ. 1.3 లక్షల నుండి రూ. 1.6 లక్షల వరకు వస్తుంది. 55 మంది రక్షణ సిబ్బంది నిరంతరం (24×7) షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారు. వీరిలో 10 మంది కంటే ఎక్కువ NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) లేదా CRPF ప్రత్యేక కమాండోలు ఉంటారు. స్టేట్ పోలీస్ కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సాయుధ పోలీసులు ఉంటారు. ఈ కేటగిరీలో నిఘా కోసం ఒక ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనాలతో పాటు అధునాతన ఆటోమేటిక్ ఆయుధాలు (MP5 గన్స్ వంటివి), ఆధునిక కమ్యూనికేషన్ గ్యాడ్జెట్లు ఉపయోగిస్తారు. డేరా బాబా (గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్) ఒక ఖైదీ అయినప్పటికీ, ఆయనకు కేటాయించిన జెడ్ ప్లస్ (Z+) భద్రతకు అయ్యే పూర్తి ఖర్చును హర్యానా ప్రభుత్వమే (ప్రజాధనం ద్వారా) భరిస్తుంది
16th Parole : ఈ పేదోళ్లే దోషులా….

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికల ప్రకారం, భారతదేశంలోని వివిధ జైళ్లలో ప్రస్తుతం సుమారు 3.9 లక్షల మంది (3,89,910) అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. భారతదేశ జైళ్లలోని మొత్తం ఖైదీలలో (సుమారు 5.3 లక్షలు) దాదాపు 74% మంది నేరం రుజువు కాకుండా కేవలం విచారణ దశలోనే మగ్గుతున్నారు. వీరిలో ఏళ్ల తరబడి (1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం) జైళ్లలోనే అండర్ ట్రయల్ నిందితుల సంఖ్య దాదాపు 1.1 లక్షల (28%) పైగా ఉంది. ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా’ నివేదికల విశ్లేషణ ప్రకారం:1 నుండి 3 సంవత్సరాలుగా సుమారు 85,000 మందికి పైగా నిందితులు ఒక ఏడాది నుంచి మూడు ఏళ్లుగా విచారణ పూర్తికాక జైళ్లలోనే ఉంటున్నారు. 3 నుండి 5 సంవత్సరాలుగా సుమారు 16,603 మంది ఖైదీలు, మూడు నుంచి ఐదేళ్లుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. సుమారు 7,128 మంది ఖైదీలు ఐదేళ్లకు పైగా కాలంగా కనీసం దోషులుగా కూడా తేలకుండా జైళ్లలోనే గడుపుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ జైళ్లలో (సుమారు 80,557 మంది) అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో బీహార్ (44,187 మంది), మధ్యప్రదేశ్ (31,712 మంది) ఉన్నాయి.
16th Parole : జైళ్లన్నీ కిటకిట

భారత దేశంలోని జైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. జైళ్ల ఆక్యుపెన్సీ రేటు 112.7% నుంచి 121% వరకు పెరిగింది, ప్రతి 100 మంది పట్టే చోట 121 మందిని కుక్కుతున్నారు. కోర్టులలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం, సరిపడా సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం, నిందితులందరూ పేదరికం కారణంగా బెయిల్ తీసుకోవడానికి కనీస షూరిటీలు సమర్పించలేకపోవడం వల్ల చాలా మంది చిన్న చిన్న నేరాలకే ఏళ్ల తరబడి జైళ్లలోనే ఉండిపోతున్నారు. ఈ సమస్యను తగ్గించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చట్టంలో సెక్షన్ 436A (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత కింద) అమలు చేస్తోంది. దీని ప్రకారం, ఏదైనా నేరానికి చట్టంలో ఉన్న గరిష్ట శిక్షా కాలంలో సగం కాలాన్ని అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లోనే గడిపేస్తే, అతనికి సొంత పూచీకత్తు పై బెయిల్ మంజూరు చేయాలి. కానీ.. ఆ అవకాశమూ ఈ పేదలకు దక్కటం లేదని మానవ హక్కుల సంఘాలు వాపోతున్నాయి.
16th Parole : ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ .
ఆంధ్రప్రదేశ్‌లో 5,705 మంది, తెలంగాణలో 4,619 మంది అండర్ ట్రయల్ ఖైదీలు (విచారణలో ఉన్న నిందితులు) ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల జైళ్లలో ని మొత్తం ఖైదీలలో అత్యధికులు (సుమారు 72% నుండి 74%) విచారణ ఎదుర్కొంటున్నవారే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ అధికారిక రికార్డుల ప్రకారం అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య 5,705 మంది (మొత్తం ఖైదీలలో వీరే 74.27% శాతంగా ఉన్నారు).శిక్ష పడిన ఖైదీలు: 2,131 మంది.మొత్తం ఖైదీల సంఖ్య: రాష్ట్రంలోని 106 జైళ్లలో కలిపి మొత్తం 7,861 మంది ఖైదీలు ఉన్నారు. ఏపీ జైళ్ల మొత్తం సామర్థ్యం 8,659 కాగా, ప్రస్తుతం 90.8% మంది ఉన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి సెంట్రల్ జైళ్లలో మాత్రం సామర్థ్యానికి మించి (124.8%) ఖైదీలు కిక్కిరిసి ఉన్నారు. తెలంగాణ జైళ్లల్లో 4,619 మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. మొత్తం ఖైదీలలో వీరు 74.5% శాతంగా ఉన్నారు . ఈ జైళ్లలో ఉండే 6,201 మంది ఖైదీలు ఉంటే.. ఒక ఏడాది మొత్తంలో సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసుల్లో కొన్ని రోజులు ఉండి విడుదలయ్యే ఖైదీల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుంది. తెలంగాణ జైళ్ల మొత్తం 8,013 మంది కాగా, ప్రస్తుతం 84.6% మంది ఖైదీలు ఉన్నారు. జాతీయ సగటు (112.7%) తో పోలిస్తే తెలంగాణలో జైళ్లు చాలా వరకు నియంత్రణలోనే ఉన్నాయి.
ALSO READ : Suspicious Death అతడెవరో…!? Andhta Prabha Crime News
