సెంట్రింగ్ కాంట్రాక్టర్ల పోరాటానికి పూర్తి మద్దతు…
సెంట్రింగ్ కాంట్రాక్టర్ల పోరాటానికి పూర్తి మద్దతు…
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.శనివారం ఇందిరా పార్క్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవన నిర్మాణానికి పునాది ఎంత ముఖ్యమో సెంట్రింగ్ కార్మికులూ అంతే ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని విమర్శించారు. సెంట్రింగ్ పనిపై ఆధారపడి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 10 లక్షల మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని తలసాని డిమాండ్ చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడినా ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతోందని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు అందించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఐక్యంగా ఉండి ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ‘చలో సెక్రటేరియట్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.

సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల హక్కుల కోసం అసెంబ్లీ లోపల, బయట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అని తలసాని అన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్మికుల అన్ని కోరికలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మండిపడ్డారు. ప్రభుత్వానికి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ పేద ప్రజల సంక్షేమంపై లేదని ధ్వజమెత్తారు. కేసులకు భయపడకుండా హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు. “కేసులకు భయపడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేవాళ్లమా?” అని ప్రశ్నించారు.

