1-Killed-Soil-Mafia : మట్టి రక్కస కేళి Andhra Prabha Crime Story

1-Killed-Soil-Mafia : మట్టి రక్కస కేళి Andhra Prabha Crime Story

  • ప్రశ్నిస్తే.. చంపుడే
  • ట్రిప్పర్​ తొక్కుడే
  • సీ-బెలగల్‌లో ఎర్రమట్టి మాఫియా దుశ్చర్య
  • . గుట్టల రక్ఱలో ప్రాణాలు వీడిన యువకుడు..

( ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో )

సీ-బెలగల్ మండలంలో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు, రవాణా వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి దాడికి గురై మృతిచెందిన ఘటనతో మట్టి మాఫియా కార్యకలాపాలపై తీవ్ర చర్చ సాగుతోంది. సహజ వనరుల పరిరక్షణ, చట్ట అమలు, ప్రజల భద్రతపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.

కర్నూలు జిల్లా సీ-బెలగల్ మండలంలో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు, రవాణా వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి దాడికి గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో మండలంలో మట్టి మాఫియా కార్యకలాపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన పూలదాసు జగన్ ఆదివారం రాత్రి గుడ్డితిప్ప కొండ ప్రాంతం నుంచి సాగుతున్న ఎర్రమట్టి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు దుండగులు కర్రలతో దాడి చేయడంతో జగన్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం పెంచికలపాడులో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిపై సీ-బెలగల్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

1-Killed-Soil-Mafia : గుట్టలపై మాఫియా కన్ను

సీ-బెలగల్ మండలంలోని పలు గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఎర్రమట్టికి భారీ డిమాండ్ ఉండటంతో అక్రమ తవ్వకాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గుడ్డితిప్ప, కొండ ప్రాంతాలు, ప్రభుత్వ భూములు, చెరువుల కట్టల వద్ద రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ తవ్వకాల కారణంగా కొండల స్వరూపం మారిపోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1-Killed-Soil-Mafia : అడ్డుకుంటే దాడులేనా?

ఇటీవల కాలంలో అక్రమ మట్టి రవాణాను ప్రశ్నించే వారిపై ఒత్తిళ్లు, బెదిరింపులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ మృతి ఘటన ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం గ్రామాల్లో భయాందోళనలకు కారణమైంది.

1-Killed-Soil-Mafia : ప్రజల ఆగ్రహం

ఈ ఘటనకు ముందు కూడా గ్రామస్తులు కర్రలు చేతబట్టి రహదారులపైకి వచ్చి ఎర్రమట్టి రవాణాను అడ్డుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. గుట్టలను కాపాడాలని, అక్రమ తవ్వకాలను నిలువరించాలని ప్రజలు పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని స్థానికులు వాపోతున్నారు.

1-Killed-Soil-Mafia : అధికారులపై ప్రశ్నల వర్షం

మండలంలో ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నప్పటికీ తగిన స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారీగా మట్టి తరలింపులు జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖలు, రెవెన్యూ యంత్రాంగం, గనుల శాఖ, పోలీసు విభాగం సమన్వయంతో మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.