దగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటం

పామర్రులో రిలే నిరాహార దీక్షల ప్రారంభం
డీఎస్సీపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామాకు డిమాండ్

పామర్రు, ఆంధ్రప్రభ: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పామర్రులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో టౌన్ పార్టీ కార్యాలయం ఎదుట ఈ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఆగస్టు 9 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.