మందోళ్లగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

గ్రామాభివృద్ధే లక్ష్యమని సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం పలు అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం శ్రీకారం చుట్టారు.

పంచాయతీ పరిధిలోని సింగరాయ చెరువు (సప్పిడోళ్లగూడెం) గ్రామంలోని 1వ వార్డులో, మందోళ్లగూడెం గ్రామంలోని 4వ వార్డులో విజన్ కంపెనీ సహకారంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్ల పనులకు సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం, ఉప సర్పంచ్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామాభివృద్ధికి విజన్ కంపెనీ యాజమాన్యం అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో ఆయా వార్డుల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడి, ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విజన్ కంపెనీ ప్రతినిధులు, వార్డు సభ్యులు యాట వెంకటేశం, చప్పిడి హంసమ్మ, కందగట్ల భవాని రామకృష్ణ, నెట్టు అంజయ్య, గ్రామ కార్యదర్శి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.