‘జై తెలంగాణ’ చెప్పలేని సీఎం: కేటీఆర్ విమర్శ
ఢిల్లీకి సామంతులుగా కాదు.. స్వతంత్రులుగా ఉండాలి
జయశంకర్ ఆశయాలకు కాంగ్రెస్ దూరం
కేసీఆర్ కమిట్‌మెంట్‌కు సాటి ఎవరూ లేరు
తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్
ఉద్యోగాలపై కాంగ్రెస్ మోసం చేసింది
అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరవొద్దు: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావమే పదవి త్యాగంతో ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన భావజాలం, మార్గదర్శకత్వం చిరస్మరణీయమని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాజీనామాలు కీలక మలుపు అని పేర్కొన్న కేటీఆర్.. 2006, 2008లో రాజీనామాల సందర్భంగా తనకు ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ వ్యూహాన్ని వివరించారని చెప్పారు. భావజాల వ్యాప్తి, ఆందోళన, వాటిని రాజకీయ శక్తిగా మలచడం ద్వారానే తెలంగాణ సాధ్యమైందని ఆయన అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్ సామాజిక పరిస్థితులను ఉదాహరణగా చూపుతూ ‘సెల్ఫ్ సఫిషియెన్సీ, సెల్ఫ్ రిస్పెక్ట్, సెల్ఫ్ రూల్’ అనే మూడు దశలను జయశంకర్ వివరించారని గుర్తు చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి వెళ్లడం వల్ల తెలంగాణ స్వాభిమానం దెబ్బతింటోందని ఆరోపించారు. తెలంగాణకు స్వతంత్ర రాజకీయ అస్తిత్వం అవసరమని, ఢిల్లీపై ఆధారపడే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడూ చెప్పేవారని పేర్కొన్నారు.

ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో లక్షలాది ఉద్యోగాల భర్తీ జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టేలా ప్రభుత్వం వ్యవహరించాలని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
