‘అమరావతి చిత్రకళా వీధి’కి గుంటూరు సిద్ధం

  • ఈనెల 8, 9 తేదీల్లో వైభవంగా ఉత్సవాలు
  • ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో చిత్రకళా సంస్కృతికి కొత్త ఊపు తీసుకురానున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ ఉత్సవాలు ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కళాకారులు, కళాభిమానులు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ గురువారం గుజ్జనగుండ్ల–విద్యానగర్ మార్గంలో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే వేలాది మంది సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల మరమ్మతులు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, వీధుల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉత్సవాలు జరిగే ప్రాంతంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పారిశుధ్య చర్యలు చేపట్టాలని, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. సందర్శకులు, కళాకారులు సౌకర్యవంతంగా కార్యక్రమాల్లో పాల్గొనేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా అధికారులు జరుగుతున్న పనుల పురోగతిని కమిషనర్‌కు వివరించారు. అమరావతి చిత్రకళా వీధి ఉత్సవాలను రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక కళా వేడుకగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, ప్రజలు చిత్రకళను ఆస్వాదించేందుకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.