AP | 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
మహిళల భద్రతపై కొత్త చట్ట సవరణకు సిద్ధం
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సమావేశాల్లో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర చట్ట సవరణలు తీసుకురానున్నట్లు తెలిపారు.
మహిళల రక్షణకు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేసి, కఠినంగా అమలు చేసేలా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ అంశంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి అవసరమైన సవరణలకు ఆమోదం తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.
అలాగే, ఈ నెలాఖరులోనే వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి, అక్కడి నుంచి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
