Vijayawada యోగతోనే ఆరోగ్యం–ఆనందం.. ప్రతి ఇంటికీ ‘యోగాంధ్ర’ చేరాలి
Vijayawada యోగతోనే ఆరోగ్యం–ఆనందం.. ప్రతి ఇంటికీ ‘యోగాంధ్ర’ చేరాలి
- కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ (Vijayawada), ఆంధ్రప్రభ:
శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యత యోగతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. యోగ కేవలం వ్యాయామం కాదని, సంపూర్ణ జీవన విధానానికి మార్గమని ఆయన అన్నారు. శ్వాసను నియంత్రించి జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తి యోగ ద్వారానే లభిస్తుందని, ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచే యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భవానిపురంలోని బెరం పార్కులో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగ అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక ఆరోగ్యానికి సమగ్ర పరిష్కారమని అన్నారు. శ్వాసను నియంత్రించే యోగ మనిషికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా, జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తిని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగాభ్యాసం అత్యంత అవసరమని చెప్పారు. యోగ సాధన ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ప్రతి రోజు కొంత సమయం యోగకు కేటాయించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చన్నారు.
ప్రతిరోజూ కేవలం 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రోటోకాల్‌ను అనుసరిస్తే, అత్యున్నత స్థాయి యోగా సాధన ద్వారా లభించే ప్రయోజనాల్లో దాదాపు 60 నుంచి 70 శాతం వరకు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో ప్రజా ఉద్యమంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసంలో భాగస్వాములు కావాలని, ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన పౌరులే రాష్ట్ర, దేశ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తారని పేర్కొన్న ఆయన, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డా. ప్రియదర్శిని, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమ్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి. శ్రీనివాసరావు, సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
