వ్యసన విముక్తి కోసం ’10 కోట్ల ప్రతిజ్ఞల’ మహా ఉద్యమం
చౌటుప్పల్‌లో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ప్రారంభం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరినీ టీవీలు, సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లు, మత్తు పదార్థాలు వంటి వ్యసనాల నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో “10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం” గురువారం చౌటుప్పల్‌లో ప్రారంభమైంది.
ప్రజాపిత బ్రహ్మాకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం (మెడికల్ వింగ్) ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖల సహకారంతో ‘నషా ముక్త భారత్ అభియాన్’, ‘మిషన్ స్పందన్’ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
రాజయోగినీ దాదీ ప్రకాశ్మణి పుణ్యస్మృతిని పురస్కరించుకుని ఈ నెల 6 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీ (10వ వార్డు) బ్రహ్మాకుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలకు చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
బ్రహ్మాకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్ క్యాంపెయిన్ కో-ఆర్డినేటర్ బి.కె. స్వర్ణలత మాట్లాడుతూ, యువతలో మానసిక పరిపక్వత, విలువలతో కూడిన జీవన విధానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం అసెంబ్లీ సమయంలో 30 నుంచి 40 నిమిషాల పాటు అవగాహన సదస్సులు, వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పాల్గొనే విద్యాసంస్థలకు భాగస్వామ్య ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని చెప్పారు.
దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా కేవలం 30 సెకన్లలో ఆన్‌లైన్ ప్రతిజ్ఞ చేయవచ్చని సూచించారు.
ఈ ప్రతిజ్ఞలో అన్ని రకాల మత్తు పదార్థాలు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉండటం, కుటుంబ సభ్యులు, స్నేహితులను దురలవాట్ల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రేరేపించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడటం, మాదకద్రవ్య రహిత భారత నిర్మాణానికి కట్టుబడి ఉండటం వంటి అంశాలు ఉన్నాయి.
కార్యక్రమంలో బ్రహ్మాకుమారీస్ ప్రతినిధులు లక్ష్మీపతి, సత్యనారాయణ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
