Aca-Wpl-2026 : ఇక అమ్మాయిల జోరు Andhra Prabha Sports Story

Aca-Wpl-2026 : ఇక అమ్మాయిల జోరు Andhra Prabha Sports Story

  • మహిళా క్రికెట్‌కు ఏసీఏ తోడు
  • సెప్టెంబరులో డ‌బ్ల్యూపీఎల్ 2026
  • మ‌హిళ‌ల ప్రతిభకు ఏసీఏ కొత్త వేదిక సిద్ధం
  • మంగళగిరిలో నాలుగు జట్ల మధ్య టీ-20 సమరం..
  • రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారిణుల ఎంపిక
  • వచ్చే ఏడాది ఆరు జట్లతో పోటీల నిర్వహణ
  • విశాఖ, కడప కేంద్రాలుగా విస్తృత ప్రణాళికలు సిద్ధం

(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ )

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చారిత్రక అడుగు వేస్తోంది. పురుషుల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) విజయవంతంగా ప్రతిభను వెలికితీసిన నేపథ్యంలో, ఇప్పుడు మహిళా క్రికెటర్ల కోసం తొలిసారిగా ఫ్రాంచైజీ విధానంలో ఉమెన్ ప్రీమియర్ లీగ్–2026ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. సెప్టెంబరు తొలి వారంలో మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న ఈ లీగ్ రాష్ట్ర మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

Aca-Wpl-2026 : ప్రతిభకు పదును పెట్టేలా…

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర జట్టుకు ఎదగాలనుకునే యువ క్రికెటర్లకు వేదికగా 2022లో ఏసీఏ ప్రారంభించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ప్రతి ఏడాది విస్తరిస్తూ రాష్ట్ర క్రికెట్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్న ఈ లీగ్ ద్వారా పలువురు యువ ఆటగాళ్లు ఉన్నత స్థాయి క్రికెట్‌లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఏపీఎల్ ఐదో సీజన్‌కు చేరుకోవడం, జట్ల సంఖ్య పెరగడం, పలు వేదికల్లో పోటీలు నిర్వహించే స్థాయికి ఎదగడం ఏసీఏ ప్రణాళికలకు నిదర్శనంగా నిలిచింది. ఇదే విజయ నమూనాను మహిళా క్రికెట్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించిన ఏసీఏ, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను ఒకే వేదికపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు ఫ్రాంచైజీ జట్లు పాల్గొనే ఈ టీ-20 లీగ్‌లో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఐదు రోజులపాటు జరుగుతాయి. రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖచ్చితమైన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Aca-Wpl-2026 : ఎంపిక కోసం కసరత్తు…

త్వరలో నిర్వహించే మహిళ క్రికెట్ పోటీల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పేర్లతో జట్లను రూపొందించనున్నారు. గతంలో రాష్ట్ర జట్టు, రంజీ, మహిళల దేశీయ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారిణులతో పాటు జిల్లాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా క్రికెటర్లకు కూడా తమ ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశం లభించనుంది. ఫ్రాంచైజీల నిర్వహణకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏసీఏ, అనంతరం జట్ల కేటాయింపు, ప్లేయర్ల వేలం, సన్నాహక మ్యాచ్‌లను నిర్వహించి ప్రధాన లీగ్‌కు శ్రీకారం చుట్టనుంది. మహిళా క్రికెట్‌కు ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ వ్యవస్థను పరిచయం చేయడం ద్వారా రాష్ట్రంలో పోటీ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Aca-Wpl-2026 : మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా …

ఇప్పటికే మంగళగిరి స్టేడియాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రధాన క్రికెట్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్న ఏసీఏ, ఈ వేదికను దేశీయ లీగ్‌లకు కీలక కేంద్రంగా మలుస్తోంది. వచ్చే ఏడాది మహిళా ప్రీమియర్ లీగ్‌ను నాలుగు నుంచి ఆరు జట్లకు విస్తరించి, విశాఖపట్నం, కడప కేంద్రాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణతో రాష్ట్ర మహిళా క్రికెట్‌కు మరింత విస్తృత అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో మహిళా క్రికెట్‌కు మౌలిక వసతులు, పోటీలు, ప్రోత్సాహం కల్పించేందుకు ఏసీఏ ఇటీవలి కాలంలో పలు చర్యలు చేపట్టింది. విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ క్రికెటర్ రావి కల్పన పేర్లతో స్టాండ్, గేటును నామకరణం చేయడం కూడా మహిళా క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలిచింది.