తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపు
తాడ్వాయి, ఆంధ్రప్రభ : నవజాత శిశువుకు తల్లిపాలే ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని, ప్రతి తల్లి తప్పనిసరిగా శిశువుకు తల్లిపాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమంలో భాగంగా బేబీ కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఎదుగుతాడని తెలిపారు.
మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, డబ్బా పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని సూచించారు. ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లను బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిపాల ప్రాముఖ్యతపై సమాజంలో మరింత అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
అనంతరం “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లులకు బేబీ కిట్లను పంపిణీ చేశారు. ఆడబిడ్డ పుట్టుకను ఆనందంగా స్వాగతిస్తూ, బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో ఈ తరహా బేబీ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్, కామారెడ్డి ప్రాజెక్టు ఇన్చార్జి సీడీపీవో కవిత, తహసీల్దార్ శ్వేత, వైద్యాధికారి డాక్టర్ కాశిమ్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, గ్రామ సర్పంచ్ మల్లవ్వ, జిల్లా మహిళా సాధికారత సిబ్బంది, పోషణ్ అభియాన్ సమన్వయకర్త, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
