ఉరివేసుకొని యువతి ఆత్మహత్య..

వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గోరుకొండ గ్రామానికి చెందిన దుంప ప్రేమలత (23) తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన సిడేం రవికుమార్ అనే యువకుడితో ప్రేమలో పడింది. సుమారు 10 నెలల క్రితం యువతి యువకుడి ఇంటికి వచ్చి ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో క్షణికావేశానికి లోనైన ప్రేమలత ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన బంధువులు ఆమెను కొన ఊపిరితో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎస్సై తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
