ఏపీకి న్యాయం చేయాలని చివరి వరకు పోరాడా – వెంకయ్య నాయుడు

  • వారసత్వం కాదు.. జవసత్వాలు కావాలి..
  • రాజకీయాల్లో సిద్ధాంతాలు, క్రమశిక్షణే ప్రధానం
  • రాజ్యాంగ పదవులపై ఇక ఆసక్తి లేదు..
  • పదవీ విరమణ చేశా.. పెదవీ విరమణ చేయలేదు
  • మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో: భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 77వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, సీనియర్ పాత్రికేయుడు మా శర్మ రచించిన “వెంకయ్య ‘నాయకుడు’ (ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు)” తెలుగు పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో జరిగిన ప్రత్యేక సభలో ఆవిష్కరించారు. అనంతరం పుస్తకాన్ని ప్రజాప్రతినిధులకు అందజేశారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తన రాజకీయ ప్రస్థానం, రాష్ట్ర విభజన, ప్రజాస్వామ్య విలువలు, కుటుంబ వ్యవస్థ, రాజకీయ సంస్కృతి వంటి అనేక అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన 2014 నాటికి అనివార్యమైందని అప్పటికే స్పష్టమైందన్నారు. 1972 జై ఆంధ్ర ఉద్యమం సమయంలోనే విభజన జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత వేగంగా జరిగేదని అభిప్రాయపడ్డారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినా, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు తగిన న్యాయం చేయాలని కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపారు.

ప్రత్యేక హోదాపై చర్చిస్తూ, తరువాత ఆర్థిక సంఘం పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ అమలుకు కృషి చేశామని చెప్పారు. మంగళగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో ఐఐటీ, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీతో పాటు అనేక కేంద్ర సంస్థలు రాష్ట్రానికి రావడంలో తన పాత్ర ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వెంకయ్య, “సిద్ధాంతం తగ్గిపోయింది.. రాద్దాంతం పెరిగిపోయింది” అని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ, పార్లమెంట్‌లలో సభ్యులు మర్యాదపూర్వక భాషను ఉపయోగించాలని, కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు పార్లమెంటరీ శిక్షణ తప్పనిసరి చేయాలని సూచించారు.”వారసత్వం కాదు.. జవసత్వాలు కావాలి” అంటూ రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించారు. కష్టపడి కిందిస్థాయి నుంచి ఎదిగిన వారికే నాయకత్వ అవకాశాలు రావాలని, అందుకే తన పిల్లలను రాజకీయాల్లో ప్రోత్సహించలేదని వెల్లడించారు.

తాను చిన్నతనంలోనే తల్లిని కోల్పోయానని, ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేయడం ద్వారా క్రమశిక్షణ, సేవాభావం నేర్చుకున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో తుపాకీ కంటే బ్యాలెట్‌కే అధిక శక్తి ఉందని, హింసతో సమాజాన్ని మార్చలేమని స్పష్టం చేశారు. “నేను పదవీ విరమణ చేశాను కానీ.. పెదవీ విరమణ చేయలేదు” అంటూ సభలో చప్పట్ల మధ్య వ్యాఖ్యానించిన వెంకయ్యనాయుడు, ఇకపై ఎలాంటి రాజ్యాంగ పదవులను ఆశించనని స్పష్టం చేశారు. తన జీవిత చరిత్రను తానే రాయాలని ఆసక్తి లేదని, రాస్తే కొన్ని అసౌకర్యమైన నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.

కుటుంబ వ్యవస్థ పరిరక్షణపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, పెద్దలకు నమస్కారం చెప్పే సంస్కారం అలవర్చాలని సూచించారు. “మన బొట్టు, కట్టు, మాట, ఆట, పాట, బాట, యాస, గోసను ఎప్పటికీ మరచిపోకూడదు” అంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ఏపీ కోసం చివరి వరకు పోరాడా