HYD | నాలాల్లో చెత్త గుట్టలు..

HYD | నాలాల్లో చెత్త గుట్టలు..

● 24 గంటలు హైడ్రా ముమ్మర చర్యలు
● కేబుల్ వైర్ల నుంచి సోఫాల వరకు వెలికితీస్తున్న సిబ్బంది
● వరద ముప్పు తగ్గించేందుకు కాలువల ప్రక్షాళన వేగవంతం

HYD | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని మురుగు, వరద కాలువలు చెత్త నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయి. కాలువలను శుభ్రం చేస్తున్న కొద్దీ భారీ మొత్తంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, కేబుల్ వైర్లు, పాత ఫర్నిచర్, పరుపులు, దిండ్లు, దుప్పట్లు, సోఫాలు, కుర్చీలు వెలికితీస్తుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా హైడ్రా (HYDRAA) ప్రత్యేక బృందాలు నిరంతరం కాలువల ప్రక్షాళన చేపడుతున్నాయి.

హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్), మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (మెట్) బృందాలు జీహెచ్‌ఎంసీ, సంబంధిత మున్సిపల్ సంస్థలు, నీటిపారుదల శాఖ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుంటూ నగరవ్యాప్తంగా కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నాయి. వర్షాలు పడకముందే వరదలకు దారితీసే కారణాలను నివారించడమే ఈ చర్యల లక్ష్యమని అధికారులు తెలిపారు.

మెహిదీపట్నం, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ మీదుగా మూసీ నదిలో కలిసే ఆఘాపురా నాలాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దారుస్సలాం సమీపంలో కల్వర్టు వద్ద భారీగా చెత్త పేరుకుపోవడంతో వరద నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీలు వెళ్లేందుకు ప్రహరీని తొలగించి ఆరు రోజులుగా చేపట్టిన పనుల్లో ఇప్పటికే 13 టిప్పర్ల చెత్త తొలగించారు. పరుపులు, సోఫాలు, కుర్చీలు, దిండ్లు, భారీ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి.

మియాపూర్–పటాన్‌చెరు మార్గంలోని బాక్స్ డ్రైన్‌లో కేబుల్ వైర్లతో కూడిన భారీ చెత్త నిల్వలు బయటపడ్డాయి. అలాగే చందానగర్–లింగంపల్లి ఆర్‌యూబీ వద్ద కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వరద నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ నుంచి రెండు ట్రక్కుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

అదేవిధంగా జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వరద నీరు కృష్ణానగర్‌ను ముంచెత్తడానికి ప్రధాన కారణమైన బాక్స్ డ్రైన్‌లో ఏళ్లుగా పేరుకుపోయిన పూడిక, చెత్తను హైడ్రా–జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా తొలగిస్తున్నాయి. అవసరమైన చోట్ల స్లాబులు తొలగించి కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేస్తున్నారు.

కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, నగరాన్ని వరదల నుంచి రక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైడ్రా అధికారులు విజ్ఞప్తి చేశారు.