Kavitha | ‘ఇడుపు కాయితం’ వివాదంపై కవిత స్పందన
● తెలంగాణ మాండలికాన్ని అవమానించడం సరికాదన్న టీఆర్‌ఎస్ నేత
● సినిమా టైటిల్ చుట్టూ కొనసాగుతున్న చర్చపై కీలక వ్యాఖ్యలు
Kavitha | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రియదర్శి, నాగదుర్గ జంటగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదంపై టీఆర్‌ఎస్ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ మాండలికంలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల పత్రం అని అర్థమని పేర్కొంటూ, ఆ పదాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
ఈ సందర్భంగా ఆ పదానికి అర్థం తెలియాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అడిగితే చెబుతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాష, యాసపై అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అలాగే, తెలంగాణ భాష, యాసను అవమానించే వ్యాఖ్యలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఆంధ్ర–తెలంగాణ మాండలికాలపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కాగా, ఈ అంశంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
