Telangana Tour | నితిన్ నబిన్‌కు ఘ‌న స్వాగ‌తం

Telangana Tour | నితిన్ నబిన్‌కు ఘ‌న స్వాగ‌తం

● తెలంగాణ‌లో మూడు రోజుల పర్యటన
● శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు
● జిల్లా కార్యాలయాల ప్రారంభం, బూత్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు

Telangana Tour | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల తెలంగాణ పర్యటన కోసం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జూన్ 28 నుంచి 30 వరకు కొనసాగే ఈ పర్యటనలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణలో పార్టీ విస్తరణపై నితిన్ నబిన్ దృష్టి సారించనున్నారు. రాష్ట్ర నాయకులతో కలిసి పలు సమీక్షలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.

పర్యటన షెడ్యూల్ ఇలా..

జూన్ 28న రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నితిన్ నబిన్, అదే వేదిక నుంచి మరో తొమ్మిది జిల్లా పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అనంతరం నాంపల్లి గ్రౌండ్స్‌లో నిర్వహించే బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.

జూన్ 29న హైదరాబాద్‌లోని వీబీఐటీలో నిర్వహించే ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం వరంగల్‌కు వెళ్లి గిరిజన ప్రతినిధులతో సమావేశమై, ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.

జూన్ 30న ఘట్‌కేసర్‌లో నిర్వహించే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం న్యూఢిల్లీకి బయలుదేరనున్నారు.