డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా కీలక అడుగు
సునీల్ భారతి మిట్టల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తో భేటీ అయ్యారు. ఏపీలో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజలకు మరింత మెరుగైన కనెక్టివిటీ కల్పించే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనతో చర్చించారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో చివరి మైలు (లాస్ట్ మైల్) ఇంటర్నెట్, మొబైల్ టవర్ కనెక్టివిటీని విస్తరించడంపై ప్రధానంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం నాణ్యమైన డిజిటల్ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు.
రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడం, సముద్రగర్భ (అండర్‌సీ) ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు, మొబైల్ సేవల సంస్థలకు వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే అంశాలపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
రాష్ట్రాన్ని డిజిటల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ లక్ష్యానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


