చేపల వేటలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి..
చిట్యాల, ఆంధ్రప్రభ : ఉపాధి కోసం చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. కాల్వపల్లి గ్రామానికి చెందిన మేకల రాజు (30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పని లేని రోజుల్లో గ్రామ శివారులోని మానేరు వాగులో చేపలు పట్టేందుకు వెళ్లేవాడు.
ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన మరో నలుగురు వ్యక్తులతో కలిసి మానేరు వాగులో విద్యుత్ తీగల సహాయంతో చేపలు పట్టేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. చేపల వేట జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రాజుకు విద్యుత్ షాక్ తగలడంతో వాగులో పడిపోయాడు.
తోటి వ్యక్తులు వెంటనే అతడిని బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు.
మృతుడికి భార్య మల్లీశ్వరి ఉన్నారు. రాజుతో కలిసి చేపల వేటకు వెళ్లిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
