పెట్టుబడి భారం తగ్గుతున్న పరిస్థితి..

  • చిన్న, సన్నకారు రైతులకు కస్టమ్ హైరింగ్ సెంటర్లు వరం
  • ఆధునిక యంత్రాల వినియోగంతో పెరుగుతున్న పంటల ఉత్పాదకత
  • ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
  • రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
  • తిరువూరు శాసనసభ్యుడు కొలికపోడి శ్రీనివాసరావు

(విస్సన్నపేట, ఆంధ్రప్రభ) : వ్యవసాయంలో ఆధునిక యంత్రాలను వినియోగించడం రైతుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తిరువూరు శాసనసభ్యుడు కొలికపోడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఆంధ్రకేసరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం (కస్టమ్ హైరింగ్ సెంటర్–సీహెచ్‌సీ)ను తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాల వినియోగం కాలానుగుణ అవసరంగా మారిందన్నారు.

ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేసుకునేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ట్రాక్టర్లు, రోటావేటర్లు, ట్రైలర్లు తదితర వ్యవసాయ యంత్రాలు ఒకే కేంద్రంలో అద్దెకు అందుబాటులో ఉండటంతో రైతులపై పెట్టుబడి భారం తగ్గడంతో పాటు పంటల ఉత్పాదకత కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతుల భూవిస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వర్గీకరణను వివరించిన ఎమ్మెల్యే, ఒక హెక్టారు వరకు భూమి కలిగిన వారిని ఉపాంత రైతులు, ఒకటి నుంచి రెండు హెక్టార్ల వరకు చిన్నకారు రైతులు, రెండు నుంచి నాలుగు హెక్టార్ల వరకు మధ్యరకం చిన్నకారు రైతులు, నాలుగు నుంచి పది హెక్టార్ల వరకు మధ్యరకం రైతులు, పది హెక్టార్లకు పైగా భూమి కలిగిన వారిని పెద్దకారు రైతులుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.

తమ భూవిస్తీర్ణానికి అనుగుణంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలు, యాంత్రీకరణ సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక సాంకేతికత, యాంత్రీకరణ, నీటి వనరుల అభివృద్ధి, మార్కెటింగ్ సౌకర్యాలు, రైతు అనుకూల పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఈ అవకాశాలను వినియోగించుకొని వ్యవసాయంలో మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. అనంతరం వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రంలో అందుబాటులో ఉన్న యంత్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే, రైతులకు నాణ్యమైన సేవలు, పారదర్శక అద్దె విధానం, సమయానికి యంత్రాల అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.