యోగాను జీవితంలో భాగం చేసుకోండి!

యోగాను జీవితంలో భాగం చేసుకోండి!

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి యోగా కీలకం: మంత్రి సత్యకుమార్ యాదవ్

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: యోగాను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని జీవన విధానంగా మార్చుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ధర్మవరం పట్టణంలోని సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో చేనేత కార్మికులు, వ్యాపార, వాణిజ్య వర్గాల కోసం ప్రత్యేక బిజినెస్ కమ్యూనిటీ థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. స్థానిక వ్యాపారులు, చేనేత వర్గాల ప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స కోసం ఇబ్బందులు పడే పరిస్థితి కంటే ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమన్నారు. అందుకు యోగా ఒక సహజమైన నివారణ మార్గమని తెలిపారు. శరీరానికి, మనసుకు సమతుల్యతను అందించే శక్తి యోగాకు ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 45 నిమిషాల నుంచి గంట పాటు యోగా సాధన చేయాలని సూచించారు. నేటి వేగవంతమైన జీవన విధానంలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా అవసరం మరింత పెరిగిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ 15 రోజుల పాటు థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్యులు, పోలీసులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు తదితర వర్గాలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ నిర్మాణానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన ‘వికసిత భారత్’ సాధనకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ వేదికల్లో అందుబాటులో ఉన్న యోగా శిక్షణ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే సాధన చేయవచ్చని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, మన పురాతన ఋషులు ప్రకృతిని పరిశీలించి అనేక యోగాసనాలను రూపొందించారని తెలిపారు. జంతువుల కదలికలు, ప్రకృతి లక్షణాల ఆధారంగా మకరాసనం, మర్కటాసనం, మార్జాలాసనం, ఉష్ట్రాసనం, శశాంకాసనం, వృక్షాసనం వంటి ఆసనాలు రూపొందించబడ్డాయని వివరించారు.

యోగం మనిషిని ప్రకృతితో మమేకం చేస్తుందని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెప్పారు. రోజుకు కొద్దిసేపు యోగా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు.

డబ్బుతో కొనలేని ఆరోగ్యం, ఆనందం యోగా సాధన ద్వారా లభిస్తాయని కలెక్టర్ అన్నారు. ఆయుష్ శాఖ ద్వారా అందిస్తున్న ఆన్‌లైన్ యోగా అవకాశాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం అరగంట యోగా చేయాలనే సంకల్పం తీసుకోవాలని కోరారు.

జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి యోగా మంచి పరిష్కారమని అన్నారు. యోగాను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడమే థీమాటిక్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు.

చేనేతకు ప్రసిద్ధి చెందిన ధర్మవరంలో వీవర్స్, వ్యాపార వర్గాలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ధర్మవరం ఇన్‌చార్జ్ ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా అధికారులు, స్థానిక వ్యాపార ప్రముఖులు, యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *