కాటమరాయుని మహా రథోత్సవం..

కాటమరాయుని మహా రథోత్సవం..
- ఉదయం 8.30 గంటలకు ఘనంగా రథోత్సవం..
- దేశంలోనే అతి పెద్ద రథాలలో ఒకటిగా కదిరి మహారథం..
- రథపు తాళ్లు పట్టుకుని లాగడం భక్తులకు మహాభాగ్యం..
- ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తుల రాక..
- మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం..
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన కాటమరాయుని రథోత్సవం మార్చి 10 ఉదయం 8.30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివస్తుండడంతో కదిరి పట్టణం ఇప్పటికే ఆధ్యాత్మిక సందడితో కళకళలాడుతోంది. దేశంలోనే అతి పెద్ద రథాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ మహారథాన్ని పూలతో, పట్టు వస్త్రాలతో, సంప్రదాయ అలంకరణలతో అద్భుతంగా అలంకరించారు. స్వామివారు రథం పై కొలువుదీరగానే భక్తుల హృదయాల్లో అపారమైన ఆనందం వెల్లివిరుస్తుంది.
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథం తిరువీధుల్లో ప్రయాణం ప్రారంభిస్తుంది. రథం కదలడం ప్రారంభమైన వెంటనే కదిరి పట్టణం అంతా జయ జయ సింహ లక్ష్మీనరసింహ.. నినాదాలతో మారుమోగుతుంది. వేలాది మంది భక్తులు భక్తి భావంతో రథపు తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం తమ జీవితంలో ఒక మహాభాగ్యంగా భావిస్తారు. ఈ పవిత్ర దృశ్యాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు గజవాహనం పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. గజవాహన సేవలో స్వామివారిని దర్శించుకుంటే.. అపారమైన పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కదిరి పట్టణం మొత్తం ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలా మారింది. ఎక్కడ చూసినా భజనలు, వేదఘోషలు, నామస్మరణలతో ఆలయ పరిసరాలు భక్తిరసంతో నిండిపోయాయి. లక్ష్మీనరసింహ స్వామివారి కటాక్షం కోసం వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి ఉత్సవాలను ఆస్వాదిస్తున్నారు.
