రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి Payyavula Keshav ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.6.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషితో ఉరవకొండ నియోజకవర్గంలోని అసంపూర్తి రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.
వ్యవసాయ, సహకార శాఖ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల మేరకు రైతు సేవా కేంద్రాల నిర్మాణాల కోసం రూ.6.33 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ జీవో విడుదల చేశారు.
గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైనప్పటికీ పూర్తికాని 32 రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన ప్రభుత్వం జీవో ఆర్టీ నెం. 452 ద్వారా రూ.6.33 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులతో ఉరవకొండ నియోజకవర్గంలోని 32 రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాల నిర్మాణాలకు కూడా నిధులు మంజూరైన నేపథ్యంలో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని స్థానికులు భావిస్తున్నారు.
